కొమురం భీం జిల్లాలో పెద్దపులి దాడిలో ఒక మహిళ మృతి చెందింది.
తెలంగాణ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి దాడి మరోసారి తీవ్ర కలకలం రేపింది. పత్తి చేనులో పని చేస్తుండగా మహిళపై పులి దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. గత కొద్దిరోజులుగా పశువులపై దాడులతో భయాందోళన కలిగించిన ఈ క్రూర మృగం, ఇప్పుడు మనుషులపై దాడి చేయడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది.
కాగజ్‌నగర్ మండలం ఈస్ గాం గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ అనే మహిళ చేనులో పత్తి సేకరిస్తూండగా ఉండగా పెద్దపులి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆమెతో పాటు పని చేస్తున్న తోటి కూలీలు భయాందోళనకు గురై పెద్దగా కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి పారిపోయింది. అయితే తీవ్రంగా గాయపడిన లక్ష్మిని ఆస్పత్రికి తరలించినా ఆమె ప్రాణాలు రక్షించలేకపోయారు.
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. పెద్దపులి సంచారంపై ముందస్తు సమాచారం ఇవ్వని ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసిందని వారు ఆరోపించారు. బాధిత కుటుంబానికి కనీసం ₹50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో, నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో కూడా పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. రోడ్డు దాటుతున్న పులి దృశ్యాలను వాహనదారులు వీడియో తీయగా, అటవీశాఖ అధికారులు సీసీటీవీ కెమెరాల్లో పులి సంచారాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో, అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజలు ఒంటరిగా అడవుల్లోకి వెళ్లకుండా, సాయంత్రం సమయానికి ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ క్రూర మృగాన్ని వీలైనంత త్వరగా పట్టుకుని ప్రజలను రక్షించాలని స్థానికులు అటవీశాఖను కోరుతున్నారు.