బ్రుసెల్స్ : ఒక వృద్దురాలులో ఒకేసారి రెండు కరోనా వైరస్ వేరియంట్ల బారిన పడి తన ప్రాణాలను కోల్పోయింది. ఈ సంఘటన బెల్జియం దేశంలో చోటు చేసుకుంది. ఆ వృద్దురాలి శరీరంలో ఏకకాలంలో యూకే మరియు సౌత్ ఆఫ్రికన్ వేరియంట్లను గుర్తించినట్లు బెల్జియం శాస్త్రవేత్తలు తెలిపారు.
బ్రుసెల్స్ ప్రాంతానికి చెందిన ఒక 90 ఏళ్ల వృద్దురాలు గత మార్చి నెలలో కోవిద్ బారినపడింది. చికిత్స కోసం ఆమెను అలాస్ట్లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. తన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ సరిగానే ఉన్నా, నిదానంగా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఐదు రోజుల తర్వాత మృత్యువాత పడింది. ఈ నేపథ్యంలో ఆమెకు పరీక్షలు నిర్వహించగా, శరీరంలో బ్రిటన్ ఆల్ఫా వేరియంట్ మరియు సౌత్ ఆఫ్రికా బెటా వేరియంట్లు రెండూ ఉన్నట్లు తేలింది.
ఒక రోగి శరీరంలో రెండు వేరియంట్లను గుర్తించడం ఇదే తొలిసారి అని పరిశోధకులు తెలిపారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయని తెలిపారు. దీనిపై మాలుక్యులర్ బయాలజిస్ట్ ఆనీ వాన్కీన్బెర్హన్ మాట్లాడుతూ, మార్చి నెలలో ఈ రెండు వేరియంట్లకు సంబంధించిన కేసులు బెల్జియంలో బాగా ఎక్కువగా నమోదయ్యాయి. ఆమె ఇద్దరు వేరు వేరు వ్యక్తుల నుంచి ఈ రెండు వేరియంట్లను అంటించుకుని ఉంటుంది.
కాగా, ఆమెకు ఈ వైరస్లు ఎలా సోకాయనే సంగతి మాత్రం తెలియలేదన్నారు. ఆమె ఆరోగ్యం త్వరగా క్షీణించటానికి ఈ రెండు వేరియంట్లే కారణమని చెప్పటం చాలా కష్టం అని తెలిపింది. కాగా, బెల్జియంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా 1,027 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 1,093,700 కేసులు రికార్డయ్యాయి, 25,198 మంది మరణించారు.