న్యూ ఢిల్లీ: వర్క్ ఫ్రమ్ హోమ్, కరోనా నేపథ్యంలో తరచుగా వింటున్న పదం. ఒకప్పుడు ఇది కొందరికే పరిమితం, కానీ ఇప్పుడు చాలా మందికి ఈ అవకాశం వచ్చింది. సామాజిక దూరం పాటించలేని కంపెనీలు ఇప్పుడు ఈ విధానాన్ని బాగా ఉపయోగిస్తున్నాయి. మహిళలకు మంచి విద్య, అనుభవం ఉన్నప్పటికీ పనివేళల ఇబ్బంది, రవాణాలో ఇబ్బందుల వల్ల చాలా మంది ఉద్యోగాలకు దూరం కావాల్సిన పరిస్థితి మనం ఎన్నో సందర్భాలలో చూస్తుంటాము.
కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కరోనా వల్ల చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని అవకాశాలు ఇస్తున్నాయి. దీంతో మహిళలకు మంచి అవకాశం లభించనుంది. వివిధ కారణాల వల్ల ఉద్యోగాలకు దూరం అయిన మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక మంచి అవకాశం.
ఇటివల ఎస్సార్ కంపెనీ హెచ్ ఆర్ ప్రెసిడెంట్ కౌస్తుభ్ సోనాల్కర్ మహిళా ఉద్యోగులను ఉద్దేశించి ఈ విధాంగా అన్నారు. ‘ ప్రతిభ, నైపుణ్యం, అనుభవం ఉన్న ఎందరో మహిళలు వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగాలకు దూరం అవుతున్నారని, కానీ ఇప్పుడు వారికి ఐటీ రంగంలోకి తిరిగి బలంగా దూసుకువచ్చే అవకాశం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనుంది. ‘ అని పేర్కొన్నారు. మహిళలు ఇంట్లో తమ పనులు చక్కదిద్దుకుంటూనే ఆఫీసు బాధ్యతలు నిర్వహించుకునే అవకాశం దొరకనుంది. ఎన్నో కంపెనీలు ఇప్పుడు మహిళలకు ఈ అవకాశాలను ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి.
ముఖ్యంగా రాత్రి పనివేళలు ఎక్కువగా ఉండే కంపెనీలలో భద్రత కారణాల వల్ల మహిళలకు ఈ రంగంలో తక్కువ అవకాశాలు ఉండేవి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మహిళలు తమ ఇళ్ళ నుండి రాత్రి షిఫ్ట్స్ లో పని చేయడానికి కూడా అవకాశం లభించనుంది. ఇంటి నుండే పని చేయవచ్చు కనుక వారి భద్రత విషయంలో భయం ఉండదన్నది ఇప్పుడు వారికి కొత్త అవకాశాలను కల్పించనుంది. తద్వారా వేతన విషయంలో అంతరం కుడా తగ్గవచ్చని పలు కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేస్తునాయి.