హైదరాబాద్ : కోవిడ్ లాక్ డౌన్ లో బాగా ట్రెండ్ అవుతున్న పదం వర్క్ ఫ్రం హోం, ఇప్పుడు ఎవరు కలిసినా, ఫోన్లో మాట్లాడుకున్నా ఇదె పదం వినిపడుతోంది. అంతేకాదు ఆన్‌లైన్‌లోనూ అత్యధికంగా వీటి గురించే మనోళ్లు తెగ వెతికేస్తున్నారు. ఎంతగా అంటే గతంతో పోల్చితే 442 శాతం పెరిగింది.
‘రిమోట్’, ‘వర్క్ ఫ్రం హోం’ ఇంకా ఈ సమానార్థం వచ్చేలా పదాలతో ఇండియన్లు అధికంగా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. గతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఒకట్రెండు ఇతర రంగాల్లోని ఉన్నతోద్యోగులకు మాత్రమే అనువుగా అందుబాటులో ఉన్న ఇంటి నుంచి పని చేసే పద్ధతి కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు చాలా రంగాలలోని ఉద్యోగులకు కూడా ఎక్కువగా విస్తరించింది.
ప్రస్తుత పరిస్థితి ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టం కావడంతో తాత్కాలికంగా అయినా ఈ పని విధానానికి అనేక సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ‘వర్క్ ఫ్రం హోం’ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్‌లైన్‌లో సెర్చింగ్ 442 శాతం పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే అత్యధికమని కూడా తేలింది.
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాల సంబంధిత సెర్చ్ ఇంజిన్ ‘ఇండీడ్’ ప్లాట్ ఫాం ద్వారా సేకరించిన డేటా ఆధారంగా రూపొందించిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత ఫిబ్రవరి నుంచి గత నెల జూలై మధ్యకాలంలో ఇంటి నుంచి చేసే ఉద్యోగాల కోసం భారతీయులు భారీ స్థాయిలో ఆన్‌లైన్‌లో వెతుకుతున్నాట్లు ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది.
‘వర్క్ ఫ్రం హోం’ పద్ధతి వల్ల మంచి ఫలితాలు రావడం, ఉత్పాదకత పెరగటం, ఉద్యోగులు కూడా క్రియాశీలంగా వ్యవహరిస్తుండటంతో కంపెనీల యజమానులు, సంస్థల ఉన్నతోద్యోగులు ఇలంటి మరిన్ని అవకాశాలు పెంచుతున్నట్టుగా ఈ నివేదిక పేర్కొంది. దీంతో ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, హెల్త్‌కేర్, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగినట్టు, ముఖ్యంగా డెలివరీ పర్సన్లు, ఐటీ మేనేజర్లకు అవకాశాలు మరింతగా డిమాండ్ ఉన్నట్టుగా తన నివేదికలో వెల్లడించింది.