న్యూయార్క్ : కరోనా వల్ల ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తోందని, 1930ల నాటి గ్రేట్ డిప్రెషన్ తర్వాత తీవ్ర ఆర్థిక మాందాన్ని ప్రపంచం చవిచూస్తోందని ప్రపంచ బ్యాంక్ చీఫ్ డేవిడ్ మల్పాస్ అన్నారు. పలు వర్ధమాన, పేద దేశాలకు కోవిడ్-19 పెను ముప్పుగా ముంచుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ విస్తృతితో ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ఆయా దేశాలోల రుణ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వారి వార్షిక సమావేశాలను పురస్కరించుకుని మల్పాస్ మీడియాతో పై విధంగా అన్నారు. చాలా లోతైన ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముట్టిందని, పేదరికంతో కొట్టుమిట్డాడుతున్న దేశాలను ఇది భారీగా దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆయా దేశాలకు భారీ వృద్ధి కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంక్ రూపొందిస్తోందని చెప్పారు.
వ్యాక్సిన్‌లను స్వయంగా సమకూర్చుకోలేని దేశాలకు వ్యాక్సిన్‌లు, మందుల సరఫరా కోసం 1200 కోట్ల డాలర్ల హెల్త్ ఎమర్జెన్సీ కార్యక్రమాల విస్తరణకు ప్రపంచ బ్యాంక్ బోర్డు ఇప్పటికే ఆమోదముద్ర వేసిందన్నారు. కోవిడ్-19తో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు సహకరిస్తున్నారని, అసంఘటిత రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి సామాజిక భద్రతా పథకాలతో ప్రభుత్వాలు అంతో ఇంతో ఆదుకుంటున్నాయని చెప్పారు.
పేద దేశాల్లో ప్రజలకు అదనపు సామాజిక భద్రత కలిగించే దిశగా ప్రపంచ బ్యాంక్ కసరత్తు సాగిస్తోందన్నారు. వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారంపైనా పనిచేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.