న్యూఢిల్లీ: కొత్త కుబేరుడు వచ్చి ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలోకి చేరాడు. ఇంత వరకు ప్రపంచంలో నెంబర్ వన్ కుబేరుడుగా కొనసాగిన అమెజాన్ కంపెనీ అధినేత జెఫ్ బిజోస్ ఇప్పుడు రెండవ స్థానానికి దిగిపోయాడు.
లగ్జరీ గూడ్స్ కంపెనీ అధినేత అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానాన్ని తొలిసారిగా దక్కించుకుంది. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ మొత్తం నికర ఆస్తుల విలువ 186.4 బిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో 13 లక్షల 57వేల 737 కోట్ల పైనే.
లూయిస్ విటన్ మోట్ హోనెస్సీ అనే కంపెనీ పేరు మీద బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ లగ్జరీ గూడ్స్ విక్రయిస్తుంది. ఆ సంస్థ స్టాక్స్ 765 మిలియన్ డాలర్ల మేర పెరగడంతో ఆర్నాల్ట్ కుటుంబం ఆస్తులు జెఫ్ బిజోస్ను మించి పోయాయి. లూయిస్ విటన్ మోట్ హోనెస్సీ అనే కంపెనీ పేరు మీద అనేక బ్రాండ్స్ ఉన్నాయి.
ఈ బ్రాండ్స్ ద్వారా లగ్జరీ గూడ్స్ విక్రయిస్తుంది. గత కొద్దీ రోజుల నుంచి ఆయా బ్రాండ్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ పెరగడంతో ఆర్నాల్ట్ ఆస్తులు వృధ్ధి చెందాయి. ప్రస్తుతం జెఫ్ బిజోస్ ఆస్తుల విలువ 186 బిలియన్ డాలర్లు. మరోవైపు ప్రపంచం కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 147.3 బిలియన్ డాలర్లు. ఎల్ఎమ్ హెచ్ వి కంపెనీ 2021 మొదటి త్రైమాసికంలో 14 బిలియన్ యూరోల రెవిన్యూ నమోదు చేసింది. 2020 మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఇది 32 శాతం అధికం.