శ్రీకాకుళం: జిరాక్స్ షాపుదారికి ఏకంగా రూ.39.19 లక్షల జీఎస్టీ బకాయిల నోటీసు రావడం కలకలం రేపింది. లావేరు మండలం భరణికం గ్రామానికి చెందిన ఎ. హరికృష్ణ, వెంకటాపురంలో జిరాక్స్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే అతనికి ఒంగోలు వాణిజ్య పన్నుల శాఖ నుంచి భారీ నోటీసు వచ్చిందంటే ఆశ్చర్యమే!
నోటీసు ప్రకారం, ఒంగోలులో నడిపిన హనుమాన్ ట్రేడర్స్‌కి రూ.36.19 లక్షల పన్ను బకాయిలు ఉన్నాయని, చెల్లించకపోతే 15 సెంట్ల స్థలాన్ని వేలం వేస్తామని హెచ్చరించారు. అసలు తాను ఒంగోలులో వ్యాపారం చేయలేదన్న హరికృష్ణ, స్థానిక అధికారులను కలిసి వివరాలు చెప్పాడు.
వాస్తవానికి, హరికృష్ణ 2008 నుంచి 2015 వరకు ఒంగోలులో ఓ బార్‌లో ఉద్యోగిగా పని చేశాడు. అయితే 2018లో అతని పేరుతో తుక్కు వ్యాపారానికి జీఎస్టీ తీసుకుని, 2019లో మూసివేశారు. పన్ను మోసం చేయడంలో అతని పేరు దుర్వినియోగమైందని అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారంపై శ్రీకాకుళం జిల్లా జీఎస్టీ కమిషనర్ రాణీ మోహన్ స్పందిస్తూ, ఒంగోలు అధికారులకు సమాచారం పంపామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. హరికృష్ణకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.