అమరావతి: వైసీపీ పార్టీ లో చెలరేగిన ఎగ్ పఫ్ వివాదం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐదు సంవత్సరాల కాలంలో ఎగ్ పఫ్‌ల కోసం 3.62 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు వచ్చిన వార్తలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి.
తెలుగుదేశం పార్టీ నేతలు ఈ విషయంలో తీవ్ర విమర్శలు చేస్తూ, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది రోజుకు సగటున 993 ఎగ్ పఫ్‌లు తిన్నారని, దీనికోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని పేర్కొన్నారు.
ఈ విషయంపై దర్యాప్తు చేసి, ఖర్చు అయిన మొత్తం తిరిగి వసూలు చేస్తామని తెలిపారు. కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ అంశంపై కథనాలు ప్రచురించడం వివాదాన్ని మరింత తీవ్రం చేసింది.
ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ ఖండన చేస్తూ, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ కథనాలను ప్రచారం చేయడం బాధాకరమని పేర్కొంది.
జాతీయ మీడియా కూడా ఎగ్ పఫ్ వివాదంపై కథనాలను రాయడం పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వార్తలు వాస్తవం కాదని, సాక్ష్యం లేకుండా పుకార్లను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది.
సమాచారాన్ని పరిశీలించకుండానే వార్తలు ప్రచురించడం జర్నలిజానికి కళంకం అని వైసీపీ వ్యాఖ్యానించింది.
వాస్తవాలను తెలుసుకుని నిజమైన వార్తలను రాయాలని, అపోహలను గుడ్డిగా ప్రచారం చేయడం సరికాదని మండిపడింది.