కాకినాడ: సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన భారీ పరాజయం తర్వాత ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైసీపీకి కీలక నేతలు దూరమవుతుండగా, తాజాగా కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పార్టీని వీడనున్నారని వార్తలు వెలువడుతున్నాయి.
ఎన్నికల తర్వాత వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, పార్టీపై ఆసక్తిని చూపడం లేదు. జాతీయ పార్టీగా బీజేపీలో చేరికపై కసరత్తు చేస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఎన్నికలలో వైసీపీ ఓటమి అనంతరం, జగన్ కన్నబాబుకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటికీ, ఆయన ఈ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడంలో అంత క్రియాశీలంగా కనిపించడం లేదు.
క్యాడర్‌తో సన్నిహిత సంబంధాలు లేకుండా ఉండడం, మీడియా ముందుకు రావడంలో వెనుకంజ వేయడం వంటి పరిణామాలు, ఆయన వైసీపీపై ఆశ చాటేసినట్టు కనిపిస్తున్నాయి.
వైసీపీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న కన్నబాబు, జనసేన లేదా టీడీపీలో చేరే అవకాశం లేకపోవడంతో బీజేపీలో చేరేందుకు ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ చేరిక కారణంగా కాకినాడ వైసీపీలో మరింత కుదుపు రానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వైసీపీకి మరో సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.