నటిపై లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయి తాజాగా హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై నేడు విచారణ జరగనుంది. పోలీసుల కథనం ప్రకారం, ముంబైకి చెందిన ఓ నటి హర్షసాయితో ఒక పార్టీలో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం ప్రేమగా మారి, హర్షసాయి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే, తనను పెళ్లి పేరుతో మోసం చేసి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని నటి ఆరోపించారు.
హర్షసాయి తనతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసి, ఆ ఫొటోలతో బెదిరించి మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, హర్షసాయి బెట్టింగ్ మాఫియాతో సంబంధాలున్నాయంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన అనంతరం, హర్షసాయి మాయం అయ్యాడు.
గత నెల 24న కేసు నమోదు చేసిన పోలీసులు హర్షసాయి పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం హర్షసాయి ముందస్తు బెయిలు కోసం కోర్టు పట్ల ఆశలు పెట్టుకున్నాడు. బాధిత నటి హర్షసాయితో కలిసి ఒక సినిమాలో నటించడంతో పాటు ఆ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించింది. ఈ కేసు పరిణామాలు ఏం దిశగా సాగుతాయో చూడాలి.