ఆంధ్రప్రదేశ్: అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.. శాంతి భద్రతలపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు కరువైపోయాయని, నేరాలు, హత్యలు, అత్యాచారాలు రోజువారీగా పెరిగిపోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘దిశా’ లేని చంద్రబాబు ప్రభుత్వం శాంతిభద్రతలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ‘చంద్రబాబు ఇదేమి రాజ్యం?’ అంటూ జగన్ ప్రశ్నించారు.
బద్వేలులో చోటుచేసుకున్న దారుణ ఘటనపై స్పందిస్తూ, కళాశాల విద్యార్థినిపై పెట్రోలు పోసి హత్య చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన వెనుక చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం ఉందని జగన్ ఆరోపించారు. “పాలకుడు ఉంటే ప్రజలు భద్రంగా ఉండాలి. కానీ, చంద్రబాబు హయాంలో ప్రజలు భయంతో జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి” అని అన్నారు.
‘దిశ’ యాప్‌పై విమర్శలు:
తమ ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ కోసం ప్రారంభించిన విప్లవాత్మక ‘దిశ’ యాప్‌ను చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని జగన్ విమర్శించారు. ‘దిశ’ యాప్‌తో 31,607 మంది మహిళలు రక్షణ పొందారని, 1.56 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. ‘దిశ’ యాప్‌ను రాజకీయ కక్షతో నిర్వీర్యం చేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు.
మహిళల భద్రతా చర్యలు:
తమ ప్రభుత్వంలో ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలు, 18 ‘దిశ’ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఈ విధానం ద్వారా మహిళల రక్షణకు పటిష్ఠ వ్యవస్థను నిర్మించామని జగన్ వివరించారు.
నేరాలకు స్పందన లేకపోవడంపై ఆవేదన:
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నేరాలపై సమీక్ష చేయలేని చంద్రబాబు పాలనను జగన్ తప్పుబట్టారు. ‘ఇది ఏ రకం పాలన? మహిళలపై జరుగుతున్న దాడులకు పోలీసులు స్పందించటం లేదు. మద్యం, ఇసుక కుంభకోణాలు, పేకాట క్లబ్బులు నిర్వహించడం మినహా చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ’ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.