కడప జగన్: 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ), గత ఎన్నికల ఫలితాల్లో మాత్రం నిరాశకు గురైంది.
ఒకప్పుడు 156 మంది ఎమ్మెల్యేల బలంతో సత్తాచాటిన ఈ పార్టీ, ఇప్పుడు కేవలం 11 సీట్లకు పరిమితం కావడం తీవ్ర ప్రతికూలతను తెచ్చిపెట్టింది.
ఈ దెబ్బ నుంచి బయటపడేందుకు, తన రాజకీయ ప్రాభవాన్ని పునరుద్ధరించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ అసలైన ప్రణాళికతో సిద్ధమవుతున్నారు.
జనవరి మూడో వారం నుంచి జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు ప్రారంభించబోతున్నారు. ప్రతీ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు గడుపుతూ, స్థానిక సమస్యలను పక్కాగా అర్థం చేసుకుంటారు.
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవడమే ఆయన లక్ష్యం.
26 జిల్లాల్లోనూ ఈ పర్యటనలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అంతేకాక, పార్టీ కార్యకర్తలతో పాటు స్థానిక నాయకులతో ప్రత్యేక సమీక్ష సమావేశాలను జగన్ నిర్వహించనున్నారు.
ముఖ్యంగా, కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజల సమస్యలపై వచ్చే సూచనలను పరిశీలించేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇది పార్టీని మరింత బలపరచడానికి ఉపయుక్తంగా మారుతుందని జగన్ విశ్వసిస్తున్నారు.
జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలతో ప్రజల హృదయాలను గెలుచుకున్నట్లుగా, ఇప్పుడు జగన్ కూడా అదే దారిని అనుసరించి ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, జగన్ చేపట్టిన ఈ ప్రణాళికలు ఏ స్థాయిలో విజయవంతమవుతాయో, ప్రజల నాడిని ఆయన ఎంతవరకు అర్థం చేసుకుంటారో చూడాల్సి ఉంది.