ఏపీ: పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యలు దళిత, గిరిజన, బీసీ, మైనారిటీల మనోభావాలను దెబ్బతీశాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని, భారత రాజ్యాంగాన్ని అవమానించే ప్రయత్నమని షర్మిల ఫైర్ అయ్యారు.
బీజేపీ రాజ్యాంగం పట్ల విశ్వాసం లేకుండా మనుస్మృతిని అమలు చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అంబేద్కర్‌ను హేళన చేసే స్థాయి బీజేపీకి లేదని, అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని షర్మిల పిలుపునిచ్చారు.
అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలతో దేశంలోని ప్రజల హృదయాలను దెబ్బతీశారని, ఈ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఆమె అన్నారు.