ఆంధ్రప్రదేశ్: అదానీ విద్యుత్ ఒప్పందాలపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2021లో అదానీ గ్రూప్‌తో చేసిన విద్యుత్ ఒప్పందాల్లో రూ.1,750 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆమె ఆరోపించారు.
షర్మిల మాట్లాడుతూ, అమెరికా దర్యాప్తు సంస్థ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని, జగన్ తన పేరు ఎక్కడైనా ఉందా? అంటూ తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అదానీ ఒప్పందాన్ని పెద్ద కుంభకోణంగా పేర్కొని కోర్టుకు కూడా వెళ్లిందని షర్మిల గుర్తుచేశారు.
అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఈ అంశంపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని, చంద్రబాబు ఆదానీ ఒప్పందాలను ఎందుకు రద్దు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు.
జగన్ అదానీ మధ్య ఉన్న ఒప్పందాలు చంద్రబాబుకు కూడా లబ్ధి చేకూర్చాయా? అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు విద్యుత్ భారాలు ప్రజలపై మోపడం అన్యాయమని, అదానీ ఒప్పందాలపై కేంద్రం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.
ఈ విషయంలో కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు లేఖ రాయనున్నట్లు ఆమె తెలిపారు. అదానీ-జగన్ మధ్య ఒప్పందాలను రద్దు చేయాలని, వాటిపై పునఃపరిశీలన చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.