విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, విశాఖ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన విశాఖ వన్‌టౌన్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) చైర్మన్‌గా ఉన్నారు.
అపర రాజకీయ చాణక్యుడు ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడుగా ద్రోణంరాజు శ్రీనివాస్ ఉత్తరాంధ్రలో చెరగని ముద్ర వేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ కు భార్య శశి, కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీవత్సవ ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి అవంతి శ్రీనివాస్ రావు, ద్రోణంరాజు రవికుమార్ సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్ మృతి బ్రాహ్మణ సమాజానికి తీరని లోటని రవికూమార్ అన్నారు.
ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపట్ల విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సంతాపం ప్రకటించారు. ద్రోణంరాజు శివైక్యం చెందారన్న వార్తను తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మంచి రాజనీతిజ్ఞుడిని విశాఖ నరగం కోల్పోయిందని పేర్కొన్నారు. విశాఖ శారదాపీఠంతో ద్రోణంరాజు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు.
సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ద్రోణం రాజు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలతోనే ద్రోణంరాజు జీవించారని కొనియాడారు. ద్రోణంరాజు కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని రాజశ్యామల అమ్మవారిని కోరుకుంటున్నానని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ మరణం విశాఖ ప్రజలకు తీరనిలోటు అని పేర్కొన్నారు. ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు.