విజయవాడ: వైసీపీ నేత పూనూరు గౌతంరెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. విజయవాడ ముత్యాలంపాడులో స్థల వివాదంలో న్యాయ పోరాటం సాగిస్తున్న గండూరి ఉమామహేశ్వరశాస్త్రిని హత్య చేసేందుకు పూనూరు కుట్ర పన్నారన్న ఆరోపణలతో తాజా ఎఫ్ఐఆర్ నమోదైంది.
గండూరి ఉమామహేశ్వరశాస్త్రిపై ఇటీవల జరిగిన దాడి వెనుక పూనూరే ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. స్థలాన్ని సొంతం చేసుకునేందుకు సుమారు రూ.25 లక్షల సుపారీ కుదుర్చుకున్నారన్న అభియోగాలు నమోదయ్యాయి.
ఈ కేసులో పూనూరు గౌతంరెడ్డిని మొదటి నిందితుడిగా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. అయితే ప్రస్తుతం పూనూరు పరారీలో ఉన్నారు.
ఇదివరకు వంగవీటి మోహన్‌రంగా వ్యాఖ్యలతో వివాదాస్పదమైన పూనూరుపై అప్పట్లో వైసీపీ వేటు వేసినా, తిరిగి పార్టీలోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.
ఫైర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన గౌతంరెడ్డి పేరుకు సంబంధించి వివిధ స్థలాలు, అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
గండూరిపై హత్యాయత్నం కేసులో మొత్తం ఆరుగురు నిందితులుగా ఉన్నారు. పూనూరు ప్రస్తుతం కడప లేదా నెల్లూరులో తలదాచుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గౌతంరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.