ఏపీ: రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. టీడీపీ కార్యకర్తలను హెచ్చరిస్తూ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
అదే సమయంలో, టీడీపీ కార్యకర్తల తాట తీస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని, సోషల్ మీడియాలోనూ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
గ్రామ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితిని తామిప్పుడు సహించబోమని స్పష్టం చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలను చూస్తూ ఊరుకోమని, వారిపై ప్రతిదాడులు ఉంటాయని ఆయన హెచ్చరించారు. తమ తడాఖా ఏంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు.
ఇకపై ప్రతి కార్యకర్తకు జగన్ అండగా ఉంటారని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.