ఏపీ: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు త్వరలోనే జనసేనలో చేరనున్నట్లు రాజకీయం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తోట, టీడీపీలో చేరి 2019లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2021లో వైసీపీలో చేరారు.
ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. తోట త్రిమూర్తులు ఇటీవల మండలి సమావేశాలకు హాజరుకావడం మానేశారు.
మరోవైపు, ఆయన వియ్యంకుడు సామినేని ఉదయభాను ఇప్పటికే జనసేనలో చేరి పార్టీ తరఫున రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. దీంతో తోటను జనసేనలోకి తీసుకురావడానికి సామినేని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
అయితే, తోటపై గతంలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. కోర్టు ఆయనకు శిక్ష విధించినప్పటికీ, పైకోర్టులో సవాల్ చేయడంతో ఆయనకు తాత్కాలిక ఉపశమనం లభించింది. దీంతో రాజకీయంగా తిరిగి బలపడాలని భావిస్తున్న తోట, జనసేనలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం ఉంది.
ఈ వ్యవహారంలో సామినేని కీలక పాత్ర పోషిస్తున్నారని, జనసేనకు చెందిన కొన్ని కీలక నేతలతో కూడా తోట చర్చలు జరిపినట్లు సమాచారం. మండపేట పరిధిలో ఆయనకు మంచి రాజకీయ బలం ఉండటంతో, జనసేన కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్లాన్ చేస్తోంది.
త్వరలోనే తోట త్రిమూర్తులు అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకోవచ్చని అంటున్నారు. ఒకప్పుడు జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న నేత, ఇప్పుడు వైసీపీని వీడి జనసేన వైపు వెళ్లడం, ఆ పార్టీకి మరో ఎదురుదెబ్బగా మారనుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.