వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇటీవల పార్టీ సోషల్ మీడియా విభాగంపై దృష్టి సారించారు. కేవలం టీడీపీనే కాదు, కూటమిని సమర్థించే ఇతర మీడియా సంస్థలపైనా పోరాటం చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా, వైసీపీ సోషల్ మీడియా విభాగం రెచ్చిపోదామని యాక్టివ్ అయ్యింది.
అయితే, గతంలో జగన్ హయాంలో తెచ్చిన 247 జీవో ఇప్పుడు వైసీపీకే అడ్డంకిగా మారింది. ఆ జీవో ఆధారంగా పాలనలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తే కేసులు పెట్టెవారు.
అప్పట్లో టీడీపీ సహా ఇతర వ్యక్తులపై కేసులు పెట్టారు. తాజాగా, పార్టీ సోషల్ మీడియా కంటెంట్ రైటర్ రవికిరణ్‌ను గుడివాడ పోలీసులు చంద్రబాబు అవినీతిపై చేసిన పోస్టు కారణంగా అరెస్టు చేయడం, కోర్టు అతనికి బెయిల్ ఇవ్వడం ఈ వివాదాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చింది.
ఇప్పుడున్న కూటమి సర్కారు జీవో 247ను రద్దు చేయకపోవడం వల్ల వైసీపీ సోషల్ మీడియా వ్యూహం స్వంతంగా దెబ్బతింటోంది. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఎలా ముందుకు సాగుతుందన్నది ఆసక్తిగా మారింది.