ఏపీ: వ్యూహాల పరంగా వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమైన మండలి ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ స్పందన లేకపోవడం రాజకీయ పండితులను ఆశ్చర్యపరిచింది.
వైసీపీ తరఫున ఎవరినీ నిలబెట్టకపోవడం, కనీస మద్దతు ప్రకటించకపోవడం వల్ల పార్టీకి లభించగల సింపతి ఓట్ల రూపంలో మిస్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక, ఈసారి అసెంబ్లీలో వైసీపీ పోరాటం శక్తి లేకుండా సాగుతోంది. ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ), పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ (పీయూసీ) చైర్మన్ పదవుల కోసం వైసీపీ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి.
అయితే, ఈ పదవులకు కనీసం 18 మంది సభ్యుల మద్దతు అవసరమున్నప్పటికీ, వైసీపీ దగ్గర ప్రస్తుత పరిస్థితిలో కేవలం 11 మంది సభ్యులే ఉన్నారు.
ఈ స్థితిలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి నేతలు నామినేషన్ వేసిన అంశం గమనార్హం. ఈ పోటీ వల్ల అసెంబ్లీ సమయం వృథా కావడమే తప్ప, ఇతర రాజకీయ ప్రయోజనాలు ఏమి ఉండబోవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్ నిర్ణయాలు ఎక్కడ అవసరం ఉందో అక్కడ తీసుకోకపోవడం, అవసరం లేని చోట అత్యుత్సాహం చూపించడం పార్టీ ఆంతర్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
తగిన వ్యూహాలకన్నా భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ వ్యూహాలు మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాలు, పార్టీ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి.