హైదరాబాద్: తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీ ఆవిర్భవించింది. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజైన ఈ రోజు ప్రారంభించారు. అందులో భాగంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండాను ఇవాళ ఆవిష్కరించారు. తరువాత వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ, నాయకుడంటే ప్రజలతో మమేకమై నడవాలని, తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్‌ఆర్ అని వ్యాఖ్యానించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి వివక్ష అనేది లేదన్నారు. తన కూతురు షర్మిలను ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలను తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్ కోసమే షర్మిల వస్తోందని ఆమె భరోసా ఇచ్చారు. వైఎస్‌ఆర్ ఆశయ సాధనకే షర్మిల పార్టీ పని చేస్తుందని, ఈ క్రమంలో షర్మిల చేతికి ప్రజల చేయి ఊతం కావాలని తాను కోరుకుంటున్నట్లు విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
పార్టీ జెండా అవిష్కరణ చేసిన్ తరువాత వైఎస్ షర్మిల, వైఎస్‌ఆర్ నాయకత్వాన్ని నిలబెడతానని, తెలంగాణలో వైఎస్‌ఆర్ పాలనను తీసుకొని వస్తానని అన్నారు. మా నాన్న మాట ఇస్తే, బంగారు మూట ఇచ్చినట్టేనని ఆమె వ్యాఖ్యానించారు. శత్రువులు సైతం ప్రశంసించిన నేత మన వైఎస్‌ఆర్ అని కొనియాడారు. ఐదేళ్ల వైఎస్‌ఆర్ పాలనలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు మరియు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించారని అన్నారు.