అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులోకి వచ్చిన జీరో ఎఫ్‌ఐఆర్ పద్ధతి బాధితుల పాలిట వరంగా మారింది. తెలంగాణాలో దిశ ఘటన తరువాత మన రాష్ట్రంలో జీరో ఎఫ్‌ఐఆర్ అమలుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు చర్యలు చేపట్టింది. తాజాగా కేంద్ర హోంశాఖ సైతం జీరో ఎఫ్‌ఐఆర్ అమలు చేయాలని, చట్టంలో ఉన్న వెసులుబాటును అమలు చేయని పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈ చట్టం ప్రకారం బాధితులు ఎవరైనా వారికి సమీపంలోని ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు, వారి ఫిర్యాదుపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయాలనే నిబంధన అందులో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఈ నిబంధనలు ఏడాది క్రితం నుంచి పక్కాగా అమలవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు జీరో ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి 341 కేసులు నమోదయ్యాయి. గతేడాది 62 కేసులు, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 279 కేసులు నమోదు చేసినట్టు దిశ ప్రత్యేక అధికారి దీపికాపాటిల్ చెప్పారు. తెలంగాణలోని షాద్‌నగర్ గ్యాంగ్ రేప్ (దిశ ఘటన)తో జీరో ఎఫ్‌ఐఆర్ అంశం తెరమీదకు వచ్చింది. ఈ ఘటనలో ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, చట్టంలో జీరో ఎఫ్‌ఐఆర్ వెసులుబాటు ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఎవరైన బాధితులు తాము ఫిర్యాదు చేసినా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదుకు నిరాకరిస్తే పోలీసులపై క్రిమినల్ (కేసు) చర్యలు తప్పవని ఇటీవల కేంద్ర హోంశాఖ సైతం హెచ్చరించింది. అన్యాయం జరిగిన చోటే ఫిర్యాదు చేసుకో.. మీ ప్రాంత పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేసుకో.. మా దగ్గరకు ఎందుకొచ్చావ్.. ఇవీ ఏళ్ల తరబడి పోలీసు స్టేషన్లలో పలువురు అధికారుల నోట కర్కశంగా వినిపించిన మాటలు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ మాటలు వినిపించడంలేదు. బాధితులు ఏ ప్రాంతం వారైనా, ఎక్కడైనా సత్వర సహాయం కోసం సమీపంలోని పోలీసు స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు.