టాలీవుడ్: ఒకరు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో హిట్ సినిమాల్లో, ఎంతో మంది సీనియర్ హీరో లతో నటించి మెప్పించిన నటుడు తేజ సజ్జ, మరొకరు వైవిధ్యమైన సినిమాలు రూపొందిస్తూ తన కంటూ ప్రత్యేక పంథా ఏర్పరచుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. వీరిద్దరూ కలిసి ‘జాంబీ రెడ్డి’ అనే సినిమాతో ఈ సంవత్సరం మన ముందుకు వచ్చారు. తొలి తెలుగు జాంబీ సినిమా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా మంచి మార్కులు కొట్టేసింది. కలెక్షన్స్ కూడా మంచిగానే రాబట్టింది. ఈ సినిమా తర్వాత తేజ సజ్జ నుండి ఇష్క్ అనే సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది.
ప్రశాంత్ వర్మ ఒక నెల క్రితం తన పుట్టిన రోజు న ‘హను-మాన్’ అనే సినిమా తియ్యబోతున్నట్టు ప్రకటించాడు కానీ అందులో నటించే నటుల వివరాలు ఏమీ వెల్లడించలేదు. ఒక ఇండియన్ సూపర్ హీరో, ఫిక్షన్ కాకుండా రియల్ సూపర్ హీరో, కామిక్ బుక్స్ కాకుండా ఇతిహాసాలు, గ్రంధాల లో ఉన్న సూపర్ హీరో కారెక్టర్ తో ఈ సినిమా రూపొందించనున్నట్టు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఈ రోజు పూజ కార్యక్రమాలతో ఈ సినిమా షూట్ మొదలైంది. ఈ సినిమాతో మరో సారి ప్రశాంత్ వర్మ , తేజ సజ్జ కలిసి పని చేయనున్నారు. ”హను-మాన్” సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన మిగతా వివరాలు మరికొన్ని రోజుల్లో తెలియనున్నాయి.