అంతర్జాతీయం: జుకర్‌బర్గ్‌పై ‘చైనా లింక్’ ఆరోపణలు: మెటా మాజీ ఉద్యోగి సంచలనం
అమెరికా భద్రతకు ప్రమాదమేనా?
అమెరికా–చైనా మధ్య వాణిజ్య విభేదాలు తారాస్థాయికి చేరిన వేళ, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg)పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అమెరికా జాతీయ భద్రతకు రాజీ పడేలా జుకర్‌బర్గ్ చైనాతో ఒప్పందాలు చేసుకున్నారని మెటా మాజీ ఉద్యోగి సారా విన్ విలియమ్స్ (Sarah Wynn Williams) ఆరోపించారు.
చైనా కమ్యూనిస్ట్ పార్టీకే డేటా లీక్?
మెటా వినియోగదారుల డేటా చైనా కమ్యూనిస్ట్ పార్టీ (Chinese Communist Party)కు అందేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించారని సారా విన్న్ వాంగ్మూలంలో తెలిపారు. “చైనా కోసం ప్రత్యేక సెన్సార్‌షిప్ టూల్స్ అభివృద్ధి చేశారు. ఇవి కంటెంట్‌ను నియంత్రించేందుకు వాడతారు,” అని ఆమె పేర్కొన్నారు. జుకర్‌బర్గ్ గత దశాబ్దంలో చైనాలో 18 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించారని ఆరోపించారు.
లామా ఎఐ, చైనా స్టార్టప్‌కు సహాయమా?
మెటా రూపొందించిన లామా (LLaMA) అనే ఎఐ మోడల్ ద్వారా చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ (DeepSeek) కు సహాయం అందిందని సారా పేర్కొన్నారు. ఈ విషయాలను బయటపెట్టినందుకు సంస్థ తనపై $50,000 జరిమానా విధించిందని పేర్కొన్నారు. అయితే ఇది అమెరికా కాంగ్రెస్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినందుకు కాదని, ఉద్యోగ ఒప్పంద ఉల్లంఘనకు సంబంధించినదని మెటా తేల్చి చెప్పింది.
మెటా ఖండన.. సేవలు లేవని వివరణ
ఈ ఆరోపణలపై మెటా అధికార ప్రతినిధి ర్యాన్ డేనియల్ (Ryan Daniel) స్పందించారు. “సారా వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం. చైనాలో మెటా సేవలు అందించడం లేదు. ఆమె చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు,” అని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం మెటా గోప్యతా విధానాలపై అమెరికాలో విచారణ ఎదుర్కొంటోంది.
ఉగ్ర భయం వేళ వివాదం మరో కోణం
చైనాపై అమెరికా ఇప్పటికే అనేక వాణిజ్య ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఈ ఆరోపణలు కొత్త దుమారం రేపుతున్నాయి. టెక్ దిగ్గజాలు జాతీయ భద్రతకు ప్రమాదం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాయన్న ఆరోపణలు అమెరికాలో తీవ్రమవుతున్నాయి.